చంద్రబాబుకు రూ.కోటి విలువైన రాఖీ? అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..


ANDRAPRADESH, CM CHANDRA BABU: ఆమెపై వరుసకు సోదరుడైన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన ఆరోపణలు చేశారని కేసులు నమోదు అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే అంశాలలో నిజాలు తెలుసుకోవడమే పెద్ద టాస్క్ గా మారింది. కంటికి కనిపించేది మాత్రమే నిజమనే సిద్ధాంతం కూడా సోషల్ మీడియా యుగంలో తప్పు అని చెప్పాల్సి వస్తోంది. 

సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజం కాదన్న విషయం కూడా గమనించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు రాఖీపై జరుగుతున్న ప్రచారం. రాఖీ పండుగ ముగిసి వారం రోజులు అవుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు రాఖీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 


గత శనివారం రాఖీ పండుగను దేశవ్యాప్తంగా నిర్వహించారు. సోదర సోదరీ బంధం చాటిచెప్పేందుకు రాఖీలు కడుతుంటారు. సెంటిమెంటుకు ఎక్కువ విలువనిచ్చే మహిళలు రాఖీ పండగను ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. దీంతో రాజకీయ నాయకులు సైతం తమ పార్టీకి చెందిన మహిళా నాయకులతో రాఖీలు కట్టించుకుంటారు. 

అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సారి ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు రాఖీలు కట్టారు. వీరిలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కూడా ఉన్నారు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న ప్రశాంతిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి రూ.కోటి విలువైన వజ్రంతో తయారు చేసిన రాఖీ కట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

ఇటీవల ప్రశాంతి రెడ్డి కేంద్రంగా నెల్లూరు రాజకీయాలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెపై వరుసకు సోదరుడైన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన ఆరోపణలు చేశారని కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో ఆమె మనుషులు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటిపై దాడి చేశారని ఆరోపణలు వినిపించాయి. దీంతో ప్రశాంతి రెడ్డి వార్తలు ఏవైనా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ అవుతున్నాయి. 

ఈ క్రమంలోనే ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.కోటి విలువైన వజ్రంతో కూడిన రాఖీ కట్టారన్న ప్రచారం కూడా బాగా వైరల్ అయింది. అయితే ఫ్యాక్ట్ చెక్ లో ఇదంతా ఫేక్ ప్రచారమని తేలిపోయింది. సాధారణ రాఖీ కట్టినా, ప్రశాంతి రెడ్డికి ఉన్న హైప్ వల్ల వ్యూస్ కోసం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఫేక్ ప్రచారం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇక మరో వైపు రాజకీయంగా ఆమె ప్రతిష్టను దిగ జార్చేలా కొందరు కావాలనే ఈ దుష్ప్రచారం చేశారని ఫ్యాక్ట్ చెక్ లో తెలిసిందని అంటున్నారు. ఈ ప్రచారంతో ఏపీలో ఫేక్ వీడియోలు ఏ స్జాయిలో హల్ చల్ చేస్తున్నాయనే అంశం మరో మారు చర్చకు కారణమవుతోంది. ఇటీవల రాష్ట్ర రాజధాని అమరావతి మునిగిపోయిందని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

అమరావతికి 150 కిలోమీటర్ల దూరంలోని పెదకూరపాడు మండలంలోని ఓ వాగు ప్రవాహం వీడియోను తీసుకుని, అమరావతిలోనే వాగులు పొంగుతున్నాయని, రాష్ట్ర రాజధాని ముంపు ప్రాంతం అంటూ కథనాలు ప్రసారం చేశారని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇదే విధంగా ప్రశాంతిరెడ్డి అంశంలోనూ ఫేక్ ప్రచారమే చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.