INDIA NEWS: ఈ రోజున దేశంలో అతి పెద్ద చర్చకు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దారి చూపించారు. ప్రజాస్వామ్యానికి మూలాధారం అయిన ఎన్నికల వ్యవస్థ మీదనే ఆయన అనేక సందేహాలను వ్యక్తం చేశారు. దేశంలో ఓట్లు పెద్ద ఎత్తున చోరీకి గురి అవుతున్నాయని రాహుల్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశవ్యాప్తంగా రచ్చకు అవకాశం ఇస్తున్నాయి. ఎన్నికల్లో ఫేక్ ఐడీలు దొంగ ఓట్లు తప్పుడు చిరునామాలు లక్షల ఓట్ల గల్లంతు, జత చేయడాలు ఇవన్నీ రాహుల్ గాంధీ దేశం ముందు ప్రశ్నలు గా పెట్టారు.
ఏకంగా ఓటర్ చోరీ వెబ్ సైట్ : రాహుల్ గాంధీ ఈ నెల 7వ తేదీనిన ఢిల్లీలో ఒక గంట పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ద్వారా అనేక సందేహాలు లేవనెత్తారు ఆయన కర్ణాటకలోని ఒక లోక్ సభ పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉదహరణగా తీసుకున్నారు. ఇక ఆయన లేవనెత్తిన అనేక అంశాలలో ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులను కొత్త ఓటర్లుగా కొన్ని చోట్ల చూపించడం, ఒకే వ్యక్తికి అనేక ఓట్లు ఉండడం, వేరు వేరు చిరునామాలతో ఒకే వ్యక్తికి ఓట్లు ఉండడం, వివిధ రాష్ట్రాలలో ఓట్లు ఉండడం, ఫేక్ ఐడీలతో ఓట్లు యాడ్ చేయడం ఇలా అనేక ఆరోపణలు చేశారు.
ఓడిన వారి ఆవేదనగా : ఇక ఈ దేశంలో 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇప్పటికి అనేక సార్లు దేశంలో లోక్ సభకు అలాగే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఎన్నికల సంఘం మీద రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం ఎక్కువగా ఉంటోంది. గెలిచిన వారు మౌనంగా ఉంటున్నారు. ఓడిన వారే విరుచుకుపడుతున్నారు. ఈ విధంగా చేస్తున్న ఆరోపణలలో సహేతుకత ఎంత అన్నది మరో చర్చగా ఉంది. అలాగని ప్రతీ ఆరోపణను కొట్టి వేయాలని కూడా లేదని అంటున్నారు. ఈసీ ప్రజలకు ప్రజాస్వామ్యానికి జవాబుదారీ అని గుర్తు చేస్తున్నారు.
ఓటర్ల లిస్ట్ ఎలా రెడీ అవుతుంది : నిజానికి చూస్తే ఎన్నికల జాబితా ప్రతీ ఏటా సవరణ జరుగుతూ ఉంటుంది. జనవరి 1వ తేదీనాటికి ఓటర్ల సవరణతో కొత్త జాబితా వస్తుంది. ఇందులో ప్రతీ ఏటా జనవరి 1ని ప్రమాణ తేదీగా పెట్టుకుని 18 ఏళ్ళు నిండిన కొత్త ఓటర్లను చేరుస్తారు. అలాగే చనిపోయిన ఓట్లను డిలీట్ చేస్తారు. అంతే కాదు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన వారు ఓట్లను షిఫ్ట్ చేస్తారు. ఇలా వివిధ రకాలుగా ఓట్ల సవరణ జరిగి కొత్త జాబితా వస్తుంది. ఈ యాడింగ్ అండ్ డిలిట్ చేసే ప్రక్రియలోనే లోపాలు ఉంటున్నాయని ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ అయినా గతంలో నాయకులు చేసినది అయినా ప్రధానంగా ఉంటోంది. ఈసీ పారదర్శకంగా వ్యవహరించి అంతా చేస్తున్నామని చెబుతున్నా రాజకీయ పార్టీలు మధ్యలో చేరి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి.
ఈసీ ఆఫీసు దాకా ర్యాలీ : ఇదిలా ఉంటే ఓట్ల దోపిడీ అంటూ ఈసీ మీద తీవ్ర విమర్శలు చేసిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన పోరాటాన్ని తీవ్రతరం చేశారు. ఆయన ఢిల్లీలో పార్లమెంట్ గేట్ నుంచి ఈసీ ఆఫీస్ దాకా సోమవారం చేపట్టిన నిరసన ర్యాలీలో వందకు పైగా ఎంపీలు పాల్గొన్నారు. ఇండియా కూటమి తరుఫున ఈ ఎంపీలు అంతా హాజరయ్యారు. ఓట్ల చోరీ జరుగుతోంది అని విపక్ష ఎంపీలు అంతా ఆరోపిస్తున్నారు. బీహార్ లో ఓటర్ల జాబితా విషయంలో జరుగుతున్న తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈసీ తేల్చాల్సిందేనా : రాజకీయ పార్టీలు నాయకులు ఎప్పటికపుడు చేస్తున్న ఆరోపణల విషయంలో నిగ్గు తేల్చాసిన అవసరం అయితే ఈసీ మీద ఉంది అని అంటున్నారు. ఈసీ స్పష్టత ఇస్తేనే ప్రజాస్వామ్యానికి అది బలమైన ఆయుధంగా మారుతుందని అంటున్నారు. జనాలలో కూడా అనుమానాలు పెరగకుండా ఈ చర్య దోహదపడుతుంది. అదే విధంగా ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఏవి అని కాదు ఎవరు అధికారంలో ఉన్నారని అంతకంటే ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యం అన్నదే అతి ముఖ్యం. ప్రజాస్వామ్యం కనుక గట్టిగా ఉంటేనే దేశానికి అది మేలుగా ఉంటుంది.
అందువల్ల ఈసీ వాస్తవాలు ఇవీ అని జనాలకు స్పష్టంగా చెప్పాలి. అదే సమయంలో తమ మీద తప్పుడు ఆరోపణలు ఎవరు చేసినా ఎంతటి వారు అయినా వారి మీద చర్యలకు ఉపక్రమిస్తేనే ప్రజాస్వామ్యం అన్నది బతికి బట్టకడుతుంది అని అంటున్నారు. ఈసీ ఖండనలు పేపర్ స్టేట్మెంట్స్ తో ఈ విషయాలకు ముగింపు అయితే ఉండదని అంటున్నారు. చూడాలి మరి రాహుల్ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి కావడంతో ఈసీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో.
Social Plugin