WORLD NEWS: ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా తో ఒక కీలకమైన ఒప్పందాన్ని కుదిరిస్తే, అది భారతదేశానికి అనేక విధాలుగా లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపడానికి అలస్కాలో పుతిన్ తో ట్రంప్ ఈ నెలలో భేటి కాబోతున్నారు. అందులో ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు ఇచ్చి సంధి చేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా యుద్ధం ఆగితే.. భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో ఒకటైన ఇంధన భద్రతకు శాశ్వత పరిష్కారం లభించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత కొన్నేళ్లుగా భారతదేశం అంతర్జాతీయ ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, పాశ్చాత్య దేశాల ఆంక్షల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేస్తూనే, అమెరికా-యూరప్‌లతో కూడా తమ సంబంధాలను కొనసాగించడంలో భారత్ సమతుల్యమైన విదేశాంగ విధానాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో పుతిన్ యుద్ధం ఆపేలా ఒక సమగ్ర ఒప్పందం ఉక్రెయిన్ తో కుదిరితే భారత్‌కు కొత్త అవకాశాలను కల్పించగలదు.
ప్రతిపాదిత ఒప్పందం అంశాలు ఈ ఒప్పందంలో ఉక్రెయిన్ భూమిని తీసుకొని రష్యా ట్రంప్ చెప్పినట్టు యుద్ధం ఆపేస్తే అమెరికా మన భారత్ పై టారిఫ్ లు ఎత్తివేస్తుంది. ఎందుకంటే రష్యా యుద్ధం సమయంలో వారి చమురు కొంటోందనే భారత్ పై ట్రంప్ టారిఫ్ లు వేశాడు. యుద్ధం ఆగితే సంధి కుదిరితే మనపై అమెరికా టారిఫ్ లు ఉండవు. ఇక 15-20 సంవత్సరాల పాటు స్థిరమైన ధరలకు ముడి చమురు, సహజ వాయువు, మరియు బొగ్గును రష్యా నుంచి పొందడం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం భారత్‌పై ఉండదు.
అమెరికన్ డాలర్‌పై ఆధారపడకుండా, భారతీయ రూపాయి .. రష్యన్ రూబుల్స్‌లో వ్యాపారం చేయడం. ఇది పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నుంచి భారతదేశానికి రక్షణ కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (INSTC) ద్వారా చమురు రిఫైనరీలు, పైప్‌లైన్‌లు, మరియు రవాణా మార్గాలపై ఇరు దేశాలూ సంయుక్తంగా పెట్టుబడులు పెట్టడం. కేవలం ఆయుధాల విక్రయాలకే పరిమితం కాకుండా, ఆధునిక సైనిక సాంకేతికతలో సహకారాన్ని పెంచుకోవడం ద్వారా భారత్ కు లాభం..
భారత్‌కు కలిగే ప్రయోజనాలు 20 సంవత్సరాల పాటు చమురు ధరలు లాక్ అవడం ద్వారా, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ లభిస్తుంది. రూపీ-రూబుల్ లావాదేవీల వల్ల అమెరికా నేతృత్వంలోని SWIFT ఆంక్షల ప్రభావం లేకుండా వ్యాపారం సులభతరం అవుతుంది. రష్యాతో బలమైన బంధం పాశ్చాత్య దేశాలతో చర్చలలో భారతదేశానికి మరింత బలాన్నిస్తుంది. అత్యాధునిక రక్షణ సాంకేతికతతో భారత సైన్యం మరింత బలోపేతం అవుతుంది.
సవాళ్లు - ముగింపు యుద్ధం ఆగిపోయి రష్యాతో భారత్ భారీ డీల్ కుదుర్చుకుంటే.. ఈ ఒప్పందంపై అమెరికా - యూరోపియన్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాల ద్వితీయ ఆంక్షలు.. ఒత్తిడి ఈ ఒప్పందానికి ప్రధాన అడ్డంకులుగా మారవచ్చు. అయితే, భారతదేశం ఎప్పటిలాగే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం పూర్తయితే ఇది భారతదేశ ఆర్థిక , భద్రతా సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపగలదు. అలాగే, బహుళధృవ ప్రపంచంలో భారతదేశం తన వ్యూహాత్మక స్వావలంబనను చాటుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం.
Social Plugin