ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌: 'సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌'


ANDRAPRADESH: త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో `సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌` ఏర్ప‌డ‌డాన్ని వారు స‌హించ‌లేక పోతున్నారు. నేత‌లు త‌లో ర‌కం. వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. ఏకంగా కూట‌మిలో అయినా!. ఎవ‌రికి వారు త‌మ త‌మ వ్య‌క్తిగ‌త పంథాల‌ను వ‌ద‌ల్లేక పోతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్‌పై ఉన్న ధ్యాస‌.. గెలు పు గుర్రం ఎక్కిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంలో చాలా మంది అంత ధ్యాస పెట్ట‌లేక పోతున్నారు. కొంద‌రు నిర్వేదంతో ఉన్నారు. ఇంకా త‌మ‌కు ప‌ద‌వులు రాలేద‌ని అనే వారు కొంద‌రైతే.. త‌మకు గుర్తింపు లేద‌ని భావించేవారు మ‌రికొంద‌రు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌నిపిస్తోంది. ఇక‌, మ‌రికొంద‌రి ఆవేద‌న డిఫ‌రెంట్‌గా ఉంది. 

 
త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో `సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌` ఏర్ప‌డ‌డాన్ని వారు స‌హించ‌లేక పోతున్నారు. వాస్త‌వానికి టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో `సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌` ఉంటోంది. దీనికి కార‌ణాలు కూడా ఉన్నాయి. గెలిచిన అభ్య‌ర్థి స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని భావి స్తే.. పార్టీ అధినేత అక్క‌డి ప‌నుల‌ను వేరే వారికి అప్ప‌గిస్తున్నారు. అదేస‌మయంలో నేత‌ల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే త‌ర‌హా `సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌` ఉంటోంది. 

ఇలా.. రాష్ట్రంలో 22 నియోజ‌క‌వ‌ర్గాల్లో `సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌` ఏర్ప‌డింది. అంటే.. ఎమ్మెల్యే క‌న్నా ప‌వ‌ర్ ఫుల్‌గా చంద్ర‌బాబు ప‌రోక్షంగా నియ‌మించిన వారు ప‌నిచేసుకుపోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కొన్ని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు, రెండు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలతోపాటు.. 10కి పైగా జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. ఇలా `సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌` ఏర్పాటు వెనుక ఎంపీల ప్ర‌మేయం ఉంద‌ని తెలుస్తోంది. ఎమ్మెల్యేల‌తో విభేదిస్తున్న ఎంపీలు.. కొంద‌రు నేత‌ల‌ను సిఫార‌సు చేస్తున్నారు. 

ఫ‌లితంగా చంద్ర‌బాబు కూడా.. ఏమీ ఆలోచించ‌కుండా ఎంపీలు చెప్పిన‌ట్టు చేసేస్తున్నారు. త‌ద్వారా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో `సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌` ఏర్ప‌డింది. అయితే.. దీనివ‌ల్ల మ‌రింత తేడా కొడుతోంది. క‌ర్నూలు జిల్లాలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌లు ఎమ్మెల్యేల కంటే కొస‌రు నేత‌లే చ‌క్రం తిప్పుతున్నారు. తిరుప‌తిలోనూ ఇదే జ‌రుగుతోంది. ఇక‌, కొత్త‌గా ఇప్పుడు మ‌రికొన్ని యువ నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా `సెకండ్ అడ్మినిస్ట్రేష‌న్ సెంట‌ర్‌`లు ఏర్పడ్డాయి. ఇది పార్టీకి ఏమేర‌కు మేలు చేస్తుందో చూడాలి. ఈ చ‌ర్య‌ల‌పై మాత్రం సీనియ‌ర్లు నిప్పులు చెరుగుతున్నారు.