ANDRAPRADESH, NARA LOKESH: కూటమి ప్రభుత్వంలో తరచూ వినిపించే పేరు ‘రెడ్ బుక్’. ఇటు అధికార పక్షమైనా.. అటు విపక్షమైనా సరే నిత్యం ‘రెడ్ బుక్’ పేరుతోనే రాజకీయాలు చేస్తున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రెడ్ బుక్ ను నిత్యం హాట్ టాపిక్ అంశంలా ట్రెండింగులో ఉంచుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఈ రెడ్ బుక్ ప్రస్తావనే కూటమి కార్యకర్తలకు ఊర్రూతలూగించింది. అప్పటి అధికార పార్టీపై వెన్నుచూపని పోరాటానికి చుక్కానిలా పనిచేసింది రెడ్ బుక్. తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ సృష్టించిన ప్రస్తుత మంత్రి లోకేశ్ అప్పట్లో చెప్పినట్లే గత 14 నెలలుగా రెడ్ బుక్ పవర్ ఏంటో చూపారు.
అయితే కొద్ది రోజులుగా మంత్రి లోకేశ్ నోటి నుంచి ‘రెడ్ బుక్’ ప్రస్తావన ఆగిపోయింది. గతంలో ఎక్కడికి వెళ్లినా ‘రెడ్ బుక్’లో ఫలానా పేజీ అమలు అవుతుందని చెప్పిన లోకేశ్ ఇప్పుడు ‘రెడ్ బుక్’ ఊసే ఎత్తడం లేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మంత్రి లోకేశ్ లో ఈ మార్పు రావడానికి కారణమేంటి? రెడ్ బుక్ లోని రాసుకున్న పేజీలు అన్నీ పూర్తయ్యాయా? అనే చర్చ జరుగుతోంది.
యువగళం పాదయాత్ర సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలతో రెడ్ బుక్ రాస్తానని అప్పట్లో లోకేశ్ ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధించిన అధికారులు, పోలీసులు, వైసీపీ నేతల పేర్లు అందులో రాస్తానని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరి తాట తీస్తానని, వడ్డీతో సహా చెల్లించేస్తామని అప్పట్లో చెప్పేవారు లోకేశ్. అధికారంలోకి వచ్చాక చెప్పినట్లే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయించగా, అప్పట్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు, పోలీసులను పక్కన పెట్టారు.
లోకేశ్ విపక్షంలో ఉండగా రెడ్ బుక్ పేరు ఎత్తితే ఎగతాళి చేసిన వైసీపీ నేతలు, తాము విపక్షంలోకి వెళ్లాక రెడ్ బుక్ అంటే హడలిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మండిపడింది.
ఇక ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే రెడ్ బుక్ కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ధర్నా చేసింది వైసీపీ. అంతేకాకుండా ప్రతి సందర్భంలోనూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారని మండిపడుతోంది. అయితే విపక్ష విమర్శలను ఏ మాత్రం లెక్కచేయని మంత్రి లోకేశ్.. తన పుస్తకంలో నెక్ట్స్ పేరు మీవే అంటూ కొందరు వైసీపీ నేతల అరెస్టులపై ముందే లీకులిచ్చేవారు.
ఈ క్రమంలో లోకేశ్ తోపాటు టీడీపీ కార్యకర్తలకు ప్రధాన టార్గెట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ వంటి వారి అరెస్టులు అయ్యాయని అంటున్నారు. ఇక మరో ప్రధాన టార్గెట్ గా చెబుతున్న మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు కూడా పెండింగులో ఉందని అంటున్నారు. ఆయన అనారోగ్య కారణం వల్ల రెడ్ బుక్ లో పేరు ఉన్నా, ఆయన విషయంలో ముందుకు వెళ్లలేదని చెబుతున్నారు.
ఇక ఎన్నికలు పూర్తయి 14 నెలలు కావడం, అరెస్టులు వల్ల కక్ష సాధిస్తున్నారనే అభిప్రాయం క్రమంగా వ్యాపిస్తుండటంతో ఇటీవల రెడ్ బుక్ ప్రస్తావన నిలిపేసినట్లు చెబుతున్నారు. తరచూ జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్ తన ప్రసంగాల్లో రెడ్ బుక్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆయన మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చేవారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేదికపై ఉన్నా సరే రెడ్ బుక్ కోసం ఒక్క మాట అయినా చెప్పేవారని, కానీ, కొన్ని రోజులుగా ఆయన ఎక్కడా రెడ్ బుక్ మాట వినిపించకపోవడం చర్చకు దారితీస్తోంది. రెడ్ బుక్ పని పూర్తయిందని నిర్ణయానికి వచ్చారా? లేక రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విపక్షం చేస్తున్న విమర్శలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న అంచనాతో ఆ ప్రస్తావన తేవడం మానేశారో తెలియాల్సివుంది.
Social Plugin