భారతీయులను వెలివేయడమే.. బ్రిటన్ కఠిన నిర్ణయం


WORLD NEWS: బ్రిటన్‌లో అక్రమ వలసదారులపై ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలలో భాగంగా అనుమతులు లేకుండా పనిచేస్తున్న ఐదుగురు భారతీయులను అరెస్టు చేశారు. బ్రిటన్‌లో నేరాలకు పాల్పడి శిక్ష పడిన విదేశీయులను స్వదేశానికి తిప్పి పంపేందుకు ఆ దేశం అనుసరిస్తున్న కఠిన విధానం ‘డిపోర్ట్‌ నౌ, అపీల్‌ లేటర్‌’ జాబితాలోకి భారత్‌ కూడా చేరింది. ఈ కొత్త విధానం కింద, కోర్టులు శిక్ష విధించిన వెంటనే నేరస్థులను వారి స్వదేశాలకు తరలిస్తారు. ఆ తర్వాత వారు స్వదేశం నుంచే తమ అపీళ్లను వీడియో ద్వారా దాఖలు చేయవచ్చు. గతంలో ఐదు దేశాలకు మాత్రమే ఈ విధానం అమలులో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్యను 23కి పెంచారు. ఇందులో భారత్‌ కూడా ఒక భాగం. 


బ్రిటన్ హోం మంత్రి యీవెట్‌ కూపర్‌ దీనిపై మాట్లాడుతూ గతంలో విదేశీ నేరస్థులు అపీళ్ల సాకుతో బ్రిటన్‌లో నెలలు, సంవత్సరాల తరబడి ఉండిపోయేవారని, దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ప్రజాధనం వృథా అయ్యేదని చెప్పారు. ఈ కొత్త చర్యతో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం అపీళ్లను తిరస్కరిస్తే, ఖైదీలు తమ స్వదేశం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపీలు విచారణలో పాల్గొనవచ్చని ఆమె స్పష్టం చేశారు. అక్రమంగా పనిచేస్తున్న భారతీయుల అరెస్టు 

బ్రిటన్‌లో అక్రమ వలసదారులపై ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలలో భాగంగా అనుమతులు లేకుండా పనిచేస్తున్న ఐదుగురు భారతీయులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వందలాది మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ హోం శాఖ ప్రకారం.. గత నెల 20 నుంచి 27 వరకు నిర్వహించిన దాడుల్లో 1,780 మంది అనుమతులు లేకుండా పనిచేస్తున్న వారిని అడ్డుకున్నారు. వీరిలో 280 మంది అక్రమ వలసదారులు, శరణార్థులు ఉన్నారు. 

పశ్చిమ లండన్‌లోని హిల్లింగ్డన్‌లో జరిగిన దాడుల్లో ఏడుగురు భారతీయులను అదుపులోకి తీసుకోగా, వారిలో ఐదుగురు సరైన అనుమతులు లేకుండా పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. బ్రిటన్ సరిహద్దు భద్రత, శరణార్థుల మంత్రి యాంజెలా ఈగల్‌ మాట్లాడుతూ అక్రమంగా పనిచేసేవారు దేశ భద్రతకు ప్రమాదకరమని, అందుకే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అక్రమ వలసలను అరికట్టడానికి కంపెనీలు తమ సిబ్బందికి సరైన అనుమతులు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ చర్యలు అక్రమ వలసలను నియంత్రించడంలో సహాయపడతాయని బ్రిటన్ ప్రభుత్వం ఆశిస్తోంది.